Best Web Hosting Provider In India 2024
US Citizenship: ముందస్తు ప్రసవాలకు ప్రవాసాంధ్రుల్ల ఆదుర్దా… నెలలు నిండకుండానే ప్రసవాలకు రెడీ.. ట్రంప్ నిర్ణయంతో టెన్షన్
US Citizenship: అమెరికా పౌరసత్వం లేని వారికి పుట్టే బిడ్డలకు జన్మతా: పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ప్రవాసుల్లో టెన్షన్ నెలకొంది. అమెరికాలో జన్మనిచ్చిన వారికి పుట్టుకతో పౌరసత్వం లభించే హక్కును ట్రంప్ రద్దు చేయనుండటంతో ఫిబ్రవరి 20లోగా ప్రసవాల కోసం హడావుడి పడుతున్నారు.
US Citizenship: అమెరికా పౌరసత్వం లేని వారికి కూడా అమెరికా భూభాగంలో జన్మిస్తే లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయించడంతో ప్రవాస భారతీయుల్లో టెన్షన్ మొదలైంది. జనవరి 20న ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానుండటంతో ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లోగా ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కనడటంతో ఫిబ్రవరి 20 నుంచి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అమల్లోకి వస్తాయనే ఆదుర్దా శాశ్వత నివాస హక్కులు ప్రవాస భారతీయుల్లో నెలకొంది.
ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు, భారతీయ సంతతికి చెందిన వారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమల్లోకి వచ్చేలోగా ప్రసవాల కోసం వైద్యుల్ని సంప్రదిస్తున్నట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంపేర్కొంది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ పౌరసత్వం విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై ట్రంప్ సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడాన్ నిర్ణయాలను రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయాల్లో యూఎస్ పౌరసత్వంపై కఠిన ఆంక్షలు విధించారు.
అమెరికా పౌరసత్వ జారీ చేయడానికి ఉన్న విధివిధానాల్లో కూడా మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం సంక్లిష్టం కానుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడటం కఠినం కానుంది. తాజా నిర్ణయం ప్రకారం అమెరికాలో జన్మించే వారి తల్లిదండ్రులకు చట్టబద్దమైన పౌరసత్వం లేకపోతే ఆ సంతానానికి కూడా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రవాస భారతీయులపై ఎఫెక్ట్ చూపనుంది.
పుట్టుకతో పౌరసత్వంపై ఆంక్షలు..
నల్లజాతి పౌరులకు అమెరికా పౌరసత్వం కల్పించే విషయంలో చేసిన చట్ట సవరణను తప్పుగా అన్వయించుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కడ జన్మించినా వారంతా అమెరికా పౌరులుగా గుర్తిస్తూ అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణలో పేర్కొన్నారు. 1857లొ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించే విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సవరణ చేపట్టారు.
పద్నాలుగవ రాజ్యాంగ సవరణలో అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పుట్టుకతోనే పౌరసత్వం విస్తరించేలా అర్థాన్నిచ్చేలా లేదని తాజా నిర్ణయంలో పేర్కొన్నారు. పద్నాలుగవ సవరణలో “అమెరికా పరిధికి లోబడి లేకుండా” అమెరికాలో జన్మించిన వ్యక్తులను పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం నుండి మినహాయించినట్టు పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ప్రకారం “అమెరికాలో జన్మించిన వారు, దాని పరిధికి లోబడి ఉండే వ్యక్తులకు జన్మించినప్పుడు మాత్రమే అక్కడే పుట్టే వారికి అమెరికా జాతీయత లభిస్తుంది. పద్నాలుగవ రాజ్యాంగ సవరణను తప్పుగా అన్వయించుకున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇకపై అమెరికాలో జన్మించినా, అమెరికా పరిధికి లోబడి లేని వ్యక్తులు, వర్గాలు, జాతీయులకు అమెరికాలో జన్మించిన సంతానానికి ఇకపై స్వయంచాలకంగా పౌరసత్వం లభించదు. గతంలో అమెరికాలో పుట్టిన వారికి వారి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం లభించేది. పౌరసత్వం కోసమే అమెరికా వెళ్లి పిల్లల్ని కన్న వారి ఉదంతాలు కూడా ఉన్నాయి. అమెరికా జాతీయులకే అవకాశాలు పేరుతో ఎన్నికల్లో ట్రంప్ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో జన్మించిన వారి తల్లి చట్టబద్దంగా నివాసం ఉంటున్నా, శాశ్వత నివాసం లేకపోయినా పిల్లలకు పౌరసత్వం లభించదు.
అమెరికాలో జన్మించిన పిల్లల తల్లి అక్రమంగా నివసిస్తున్నా, తండ్రి అమెరికా పౌరుడు కాకపోయినా ఆ సంతానానికి పౌరసత్వం దక్కదు.
శిశువు తల్లి అమెరికాలో చట్టబద్దంగా ఉంటున్నా, టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ పర్మిట్ ఉంటూ అమెరికా పౌరుడు కాని తండ్రికి జన్మించినా వారికి పౌరసత్వం దక్కదు.
తాాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇలాంటి వారికి అమెరికా పౌరసత్వ ధృవీకరణలు మంజూరు చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇకపై పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా ఉత్తర్వులపై 30రోజుల్లోగా సంబంధిత శాఖలు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉత్తర్వుల్లో తల్లిదండ్రులకు సంబంధించిన నిర్వచనాలను కూడా స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ఈ లింకు ద్వారా చూడండి…. https://www.whitehouse.gov/presidential-actions/2025/01/protecting-the-meaning-and-value-of-american-citizenship/
ప్రవాసుల గుండెల్లో రైళ్లు…
అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయంతో చిక్కులు తప్పవని భావిస్తున్న వారు ఈ లోపే తమ పిల్లలకు పౌరసత్వం కోసం ముందస్తు ప్రసవాలకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తాయనే ఉద్దేశంతో ఈ లోపు నెలలు నిండకుండానే ప్రసవించేందుకు వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. మార్చిలో డెలివరీ జరగాల్సి ఉన్న వారిలో కొందరు ఈలోపు బిడ్డల్ని ప్రసవించేందుకు సిజేరియన్లకు సిద్ధపడుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
అమెరికాలో స్థిరపడిన భారతీయ గైనకాలజిస్ట్‌ను ఉటంకిస్తూ వెలువడిన కథనంలో ట్రంప్ ఉత్తర్వుల నేపథ్యలో సిజేరియన్ సర్జరీ కోసం ప్రవాసాంధ్రులు సంప్రదిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 19 లోపె అమెరికాలో పుట్టే వారికి అమెరికా బర్త్ రైట్ హక్కులు లభిస్తాయనే యోచనతో ముందస్తు డెలివరీలకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 20 తర్వాత డెలివరీ అవకాశాలు ఉన్నభారతీయ దంపతులు చాలా మంది అక్కడున్న ఇండియన్-అమెరికన్ వైద్యులను ముందస్తు సర్జరీల కోసం సంప్రదిస్తున్నట్లు ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది.
ఇలా ముందస్తు సర్జరీల కోసం ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలా మంది హెచ్-1బీ, ఎల్1 వీసాలపై అమెరికాకు వచ్చి నవారు, గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటున్నారు. అమెరికాలో పుట్టిన వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తే, వారి తల్లిదండ్రులకు ఆ పిల్లలకు 21 ఏళ్లు నిండిన తర్వాత శాశ్వత నివాస హక్కులు దక్కుతాయి. ఈ క్రమంలో ఏళ్ల తరబడి అమెరికాలో ఉంటూ అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడిన తర్వాత పెద్దసంఖ్యలో భారతీయ దంపతులు సిజేరియన్ సర్జరీల కోసం ఆస్పత్రులకు వస్తున్నట్టు న్యూజెర్సీకి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ రమ వివరించినట్టు పేర్కొన్నారు.
ఏడో నెల గర్భంతో మహిళ తన భర్తతో సహా వచ్చి నెలలు నిండకముందే ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధపడినట్టు వైద్యురాలు వివరించారు. పౌర సత్వం కోసం నెలలు నిండకముందే సిజేరియన్ చేస్తే అలా పుట్టే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని, తక్కువ బరువు, ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నట్టు మరో వైద్యురాలిని ఉటంకించారు. పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ముందస్తు డెలివరీల కోసం ఆదుర్దా పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్