Best Web Hosting Provider In India 2024
Amaravati Works: ఫిబ్రవరి రెండో వారం నుంచి అమరావతి నిర్మాణ పనుల్లో వేగం, తుదిదశలో టెండర్లు
Amaravati Works: ఫిబ్రవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ భరోసా ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, హడ్కో రుణాలు మంజూరు కావడంతో టెండర్ల ఖరారు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
Amaravati Works: రాజధాని నిర్మాణ పనులు ఫిబ్రవరి నుంచి వేగం పుంజుకుంటాయని మంత్రి నారాయణ వివరించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఎదురైన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటూ అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తున్నామని చెప్పారు.
రాజధానిలోని నేలపాడులో జరుగుతున్న ధ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు…నేలపాడు సమీపంలో 2019 కు ముందే పనులు ప్రారంభమైన అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, వీటిలో జీఏడీ టవర్ తో పాటు మరో నాలుగు టవర్లు,హైకోర్టు రాఫ్ట్ పౌండేషన్ ల వద్ద ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.
ఐదు టవర్లతో పాటు,హైకోర్టు పునాదులు నీటిలో మునిగి ఉండటంతో కొద్ది రోజులుగా ఆ నీటిని బయటికి తోడివేసే పనులు జరుగుతున్నాయి. 2015 జనవరి ఒకటో తేదీన రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీచేయగా కేవలం 58 రోజుల్లోనే మొత్తం 34 వేల ఎకరాల భూమిని రైతులు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి అప్పగించారని నారాయణ గుర్తు చేశారు.
రైతులు భూములిచ్చి ఎంతో త్యాగం చేశారని ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో రాజధాని ఉండాలని పనులు ప్రారంభించినట్టు చెప్పారు.అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో నిర్మించే అసెంబ్లీ,అడ్మినిస్ట్రేటివ్ టవర్లు,హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని నిర్ణయించామని మొత్తం కోటీ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.
సచివాలయ అధికారులతో పాటు హెచ్ వోడీ అధికారులు అందరూ ఒకేచోట ఉండేల జీఏడీ టవర్ తో పాటు మరో నాలుగు టవర్లు డిజైన్లు చేశారు.జీఏడీ టవర్ ను 48 అంతస్థులతో 17 లక్షల 3వేల 433 చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ, టవర్ 1,టవర్ 2 లను 40 అంతస్తులతో 28.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో,టవర్ 3,టవర్ 4 లను 40 అంతస్థుల్లో 23 లక్షల 42 వేల 956 చదరపు అడుగుల్లో నిర్మించేలా డిజైన్ చేసినట్టు తెలిపారు.
ఇక హైకోర్టును 8 అంతస్థుల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250 మీటర్ల ఎత్తులో వ్యూపాయింట్ వచ్చేలా డిజైన్ చేసినట్టు వివరించారు.
అసెంబ్లీ లేని రోజుల్లో టూరిజం ప్రాంతంగా ఉండేలా పక్కా ప్లానింగ్ తో డిజైన్ చేశారని ఈ డిజైన్ల ప్రక్రియ కూడా పూర్తయిందని …నిర్మాణాలకు సంబంధించి పనులు కూడా ప్రారంభించినట్టు చెప్పారు.వీటితో పాటు మరో కోటీ 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు,ప్రజాప్రతినిధులు,ఉద్యోగులకు సంబంధించిన 4053 అపార్ట్ మెంట్ ల నిర్మాణం కూడా గతంలోనే ప్రారంభించినట్టు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ మీద కక్షతో ఈ నిర్మాణాలన్నీ నిలిపివేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు…ఐకానిక్ భవనాల పునాదులు నీటిలోనే ఏళ్లతరబడి ఉండిపోవడంతో ఐఐటీ నిపుణల నివేదిక ఆధారంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.
న్యాయపరమైన సమస్యలతోనే అమరావతి పనులు ఆలస్యం
గత ప్రభుత్వం అస్తవ్యస్థ పాలనతో అమరావతికి అనేక న్యాయసమస్యలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం చేసి ముందుకెళ్తున్నామన్నారు…సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించే నాటికి ఇదంతా అడవిగా ఉందని….వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేయాలని సీఎం తనను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
తనకు రెండోసారి కూడా మున్సిపల్ శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించి అమరావతి నిర్మాణంపై కీలక ఆదేశాలు ఇచ్చారని అన్నారు…న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేసి ముందుకెళ్లామన్నారు…రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రెండు విడతల కౌలు నిధులను కూడా జమచేశామన్నారు.
ఇప్పటివరకూ అమరావతి నిర్మాణం కోసం 38వేల 571 కోట్ల విలువైన 40 పనులకు టెండర్లు పిలిచామని ఈ నెలాఖరునాటికి అన్ని పనులకు టెండర్లను పిలిచి ఫిబ్రవరి రెండో వారం నుంచి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తామని మరోసారి స్పష్టం చేసారు.
సంబంధిత కథనం
టాపిక్