Best Web Hosting Provider In India 2024
సిబ్బందిని కుదిస్తే పౌర సేవలు అందుతాయా?
వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి
తాడేపల్లి: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్ధం చెబుతూ ఐదేళ్ల క్రితం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో వైయస్ జగన్ విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శివశంకర్ మీడియాతో మాట్లాడారు.
సచివాలయాల సిబ్బందిని జనాభా ప్రాతిపదికన తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. 2,500 కంటే జనాభా తక్కువ ఉండే చోట ‘ఏ’ కేటగిరీ గ్రామ సచివాలయాలుగా పరిగణించి ఆరుగురు ఉద్యోగులను కేటాయిస్తున్నారు. 2,500–3,500 జనాభా ఉండే ‘బీ’ కేటగిరీ గ్రామ సచివాలయాలలో ఏడుగురు చొప్పున, అంతకు మించి జనాభా ఉంటే ‘సీ’ కేటగిరీగా పరిగణించి కనీసం 8 మంది చొప్పున సచివాలయాల ఉద్యోగులను పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ చర్యలతో సుమారు 23,600 మంది ఉద్యోగులకు కోతపెడుతూ..మరోవైపు పౌర సేవలను దూరం చేస్తుందని ధ్వజమెత్తారు.
నాడు వాలంటీర్లు..నేడు సచివాలయ ఉద్యోగులు
ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవవేతనం రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని వైయస్ఆర్‌సీపీ నాయకుడు శివశంకర్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా తప్పించేందుకు రేషనలైజేషన్ పేరుతో ఒక్కో సచివాలయంలో 6 మంది ఉద్యోగులను కుదిస్తున్నారు. ఇలా ఉద్యోగులను తొలగిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి రెవెన్యూ సేవలు అందించే వీఆర్‌వోలను తగ్గిస్తే భూ తగాదాలు, సమస్యలు అధికమవుతాయన్నారు. ఈ వ్యవస్థ ద్వారా వైయస్ఆర్‌సీపీ హయాంలో 11 లక్షల సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. అద్భుతమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయాలకు 2.90 లక్షల స్మార్ట్‌పోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు..ఇలా ఫ్లంగ్ ప్లే వ్యవస్థను ఏర్పాటు చేస్తే..ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులందరిని కొనసాగించాలని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని శివశంకర్‌రెడ్డి డిమాండు చేశారు.