Best Web Hosting Provider In India 2024
TG MLC Election 2025 : ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి – కాంగ్రెస్ ప్రకటన
కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వి.నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్ నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పక్షం రోజుల క్రితం బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి కి చెందిన మాల్క కొమరయ్య లను ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డిని ఎంపిక చేశారు.
నరేందర్ రెడ్డి పేరు ఖరారుతో సంబరాలు…
కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డి పేరు ఖరారు కావడంతో కాంగ్రెస్ తో పాటు నరేందర్ రెడ్డి కుటుంబసభ్యుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. నరేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సిట్టింగ్ స్థానం పదిలంగా వ్యూహం….
సిట్టింగ్ ఎమ్మెల్సీగా జగిత్యాలకి చెందిన టి.జీవన్ రెడ్డి ఉన్నారు. టిపిసిసి తోపాటు ఉత్తర తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వవాలని టిపిసిసి సమావేశంలో నిర్ణయించి ఏఐసిసికి ప్రతిపాదన పంపించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేయనని ఏఐసీసీ ప్రతినిధులకు చెప్పడంతో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తో పాటు ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రసన్న హరి కుమార్, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్ రావు ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా సామాజికంగా ఆర్థికంగా విద్యా పరంగా పలువురితో సత్సంబంధాలు ఉన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
వీరి మధ్యనే ప్రధానం పోటీ….
ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రెండు అధికార పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి పేరును 15 రోజుల క్రితమే ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాని ఖరారు చేసింది. రెండు ప్రధాన పార్టీలు ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలుపగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.
ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. 2018 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అధికారంలో ఉండి బిఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపలేక పోయింది. అధికారంలో ఉన్నప్పుడే పోటీ చేయని బిఆర్ఎస్ రెండు అధికారం పార్టీల మధ్య బిఆర్ఎస్ నెగ్గడం కష్టమని భావిస్తూ పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 జిల్లాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో అందులో మొత్తం 3 లక్షల 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకునేలా 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్.
సంబంధిత కథనం
టాపిక్