Best Web Hosting Provider In India 2024
Carrot Rasgulla: క్యారెట్ హల్వా తిని ఉంటారు, కానీ క్యారెట్ రసగుల్లాలు ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేశారంటే ఇక వదలరు?
క్యారెట్ హల్వాను చాలా సార్లు తయారు చేసుకుని, తిని ఉంటారు. కానీ రసగుల్లాలను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పటి వరకూ లేకపోతే ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఒక్కసారి క్యారెట్ రసగుల్లాలను తిన్నారంటే జీవితాంతం మర్చిపోరు.
క్యారెట్ రసగుల్లాలు తయారు చేయడం ఎలా? (Instagram)
శీతాకాలంలో క్యారెట్లు పుష్కలంగా లభిస్తాయి. పోషకాలతో నిండిన ఈ రుచికరమైన కూరగాయతో అనేక వంటకాలు తయారు చేస్తారు. క్యారెట్ తో ఇప్పటివరకూ మీరు కూర, ఖీర్, క్యారెట్ రైస్, పరోటాలు, ముఖ్యంగా హల్వా తయారు చేసుకుని తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా క్యారెట్ రసగుల్లాలు తిన్నారా? వినడానికి ఇది కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ నిజంగా క్యారెట్‌తో చాలా మెత్తటి, రసభరితమైన రసగుల్లాలు తయారవుతాయి. వీటిని ఒకసారి తిని చూశారంటే మిగతా స్వీట్లన్నీ వీటి ముందు తక్కువే అని ఫీలవుతారు. ఈసారి క్యారెట్లు తెచ్చినప్పుడు తప్పకుండా ఈ రసగుల్లాలను తయారు చేసుకోండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు.
క్యారెట్ రసగుల్లాలు తయారీకి కావలసిన పదార్థాలు
రసగుల్లాలు తయారీ కోసం:
- రెండు నుండి మూడు పెద్ద క్యారెట్‌లు,
- రెండు కప్పుల పాలు,
- మూడు చెంచాల నెయ్యి,
- ఒక కప్పు బొంబాయి రవ్వ,
- మూడు చెంచాలు చక్కెర,
- ఆరెంజ్ ఫుడ్ కలర్
సూప్ తయారు చేసుకోవడం కోసం:
- ఒక కప్పు చక్కెర,
- అర కప్పు నీరు,
- చిటికెడు యాలకుల పొడి
క్యారెట్ రసగుల్లాలను తయారు చేసే విధానం..
- క్యారెట్ రసగుల్లాలు తయారు చేయడానికి ముందుగా రెండు పెద్ద క్యారెట్లను తీసుకొని, బాగా కడిగి, తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి.ఎరుపు క్యారెట్లయితే రెసిపీ మరింత రుచికరంగా ఉంటుంది. రంగు కూడా చాలా బాగుంటుంది.
- ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను మిక్సీలో వేసి, దాదాపు అర కప్పు పాలు వేసి మెత్తటి పేస్ట్‌లా చేయండి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, దానిలో రెండు చెంచాల నేయి వేసి వేడి చేయండి.
- తర్వాత దాంట్లో క్యారెట్ పేస్ట్ వేసి, నాలుగు నుండి ఐదు నిమిషాలు బాగా కలుపుతూ వేయించండి.
- క్యారెట్ పేస్ట్ అంతా నెయ్యిలో బాగా వేగిన తర్వాత దాంట్లో వేడి పాలను ఒక అరకప్పు వరకూ తీసుకుని దాంట్లో పోయండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉంటూ మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించండి.
- పాలు మరుగుతున్న సమయంలోనే దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపండి.
- తరువాత దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేయండి. రవ్వ గడ్డలు కట్టకుండా ఉండేందుకు పాలలో కలిసే వరకూ కలుపుతూ ఉండండి.
- రవ్వంతా ఉడికి పిండిలా మారిన తర్వాత దాంట్లో ఒక చెంచా నెయ్యి, చక్కెర వేసి కలపండి.
- ఈ మిశ్రమాన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
- చల్లారిన తర్వాత క్యారెట్ పేస్టును ఉండలుగా తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే పిల్లలకు నచ్చిన షేపుల్లో కూడా వీటిని తయారు చేసుకండి.
- ఈ ఉండలను ఒక జాలీ గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని దాంట్లో నీరు పోసి వేడి చేయండి.
- నీరు మరుగుతున్న సమయంలో దాని మీద జాలీ గిన్నెను పెట్టి ఆవిరి మీద రసగుల్లాలు ఉడికేలా ఉంచండి. దాదాపు పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిన తర్వాత రసగుల్లాలను తీసి బయట పెట్టి కాస్త చల్లారనివ్వండి.
ఇవి ఉడికేలోపు రసగుల్లాల్లోకి సూప్ తయారు చేసుకోండి..
- ఇందుకోసం ఒక పాన్‌లో నీరు పోసి వేడి చేయండి. నీరు మరుగుతున్న సమయంలో దాంట్లో చక్కెర, యాలకుడ పొడి వేసి కలపండి.
- ఇది చక్కగా మరుగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి.
- రసగుల్లాలు, చక్కెర సూప్ కాస్త చల్లారిన తర్వాత రెండింటిలో ఒక దాంట్లొ వేసి అరగంట పాటు అలాగే ఉంచండి.
- అరగంట పాటు రసగుల్లాలు ఈ సూప్ లో నానాయంటే టేస్టీ క్యారెట్ రసగుల్లాలు తయారైనట్టే.
వీటి రుచి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి.