Best Web Hosting Provider In India 2024
Allu Arjun: తొక్కిసలాట కేసు తర్వాత తొలిసారి మూవీ ఈవెంట్‍కు అల్లు అర్జున్.. అభిమానులకు నో ఎంట్రీ!
Allu Arjun – Thandel Pre Release Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తొలిసారి మూవీ ఈవెంట్‍లో అల్లు అర్జున్ పాల్గొననున్నారు. తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరుకానున్నారు. ఆ వివరాలు ఇవే..
పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటున్నారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఓ రోజు జైలులో ఉన్న అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. ఇటీవలే రెగ్యులర్ బెయిల్ రాగా.. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. అయితే, ఈ తొక్కిసలాట తర్వాత ఏ ఈవెంట్‍లోనూ అల్లు అర్జున్ పాల్గొనలేదు. అయితే, ఇప్పుడు ఆ ఘటన అనంతరం తొలిసారి మూవీ ఈవెంట్‍కు వస్తున్నారు బన్నీ. తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా రానున్నారు.
ఈవెంట్ ఎక్కడంటే..
తంజేల్ జాతర పేరుతో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 1) హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో జరగనుంది. తండేల్ రాజు కోసం పుష్ప రాజ్ వస్తున్నాడంటూ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ అనేలా మూవీ టీమ్ వెల్లడించింది. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్న తండేల్ మూవీ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా బన్నీ హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత బన్నీ పాల్గొనున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
అభిమానులకు నో ఎంట్రీ!
అల్లు అర్జున్ వస్తున్న తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు అభిమానులకు ఎంట్రీ లేదని తెలుస్తోంది. ఇండోర్ ఈవెంట్‍గా సాగనుంది. తండేల్ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణులు, కొందరు సినీ సెలెబ్రిటీలు మాత్రమే ఈవెంట్‍కు వస్తారని సమాచారం. ఫ్యాన్స్‌కు అనుమతి లేదని, ఎలాంటి పాస్‍లు కూడా పంచలేదని తెలుస్తోంది. దీంతో అభిమానులు లేకుండానే ఈ ఈవెంట్ సాగనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావంత ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.
కొత్త లుక్‍లో కనిపించనున్న అల్లు అర్జున్
సుమారు ఐదేళ్లుగా ఎక్కువ గడ్డంతో పుష్ప రాజ్ లుక్‍లోనే అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఇటీవలే దాన్ని మార్చేశారు. గడ్డం ట్రిమ్ చేసేసి స్టైలిష్‍గా మారారు. ఈ ఈవెంట్‍లో కొత్త లుక్‍తో బన్నీ కనిపించనున్నారు. పుష్ప 2 భారీ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. తదుపరి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో సినిమా చేయనున్నారు అల్లు అర్జున్.
తండేల్ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీకి ప్రొడ్యూజర్‌గా బన్నీ వాసు ఉండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
తండేల్ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగచైతన్య నటించారు. నిజ జీవిత ఘటనలతో ఈ మూవీ తెరకెక్కించింది. లవ్ స్టోరీ, దేశభక్తి మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు చందూ. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై అంచనాలు భారీ ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం