Best Web Hosting Provider In India 2024
Fake liquor in AP : అక్కడ 80 రూపాయలకే క్వార్టర్ మద్యం.. తాగారో అంతే సంగతులు!
Fake liquor in AP : ఏపీ ప్రభుత్వం తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ అందజేయాలని ప్రయత్నిస్తోంది. కానీ కొన్నిచోట్ల ఇంకా తక్కువ ధరలకే ఓ ముఠా మద్యం సరఫరా చేస్తోంది. దీనిపై అనుమానం వచ్చి అధికారులు నిఘా పెట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ ముఠా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
నాలుగేళ్ల కిందట కొవిడ్ కారణంగా మద్యం షాపులు సహా అన్ని మూతపడ్డాయి. ఈ సమయంలో మద్యం సేవించే అలవాటు ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల్లోని బెల్టు షాపుల్లో మద్యం నిల్వ ఉంచుకున్నవారు అమాంతం రేట్లు పెంచారు. దీంతో బాగా డిమాండ్ పెరిగింది. దీన్ని గమనించిన ఓ ముఠా నకిలీ మద్యం తయారీకి తెరతీసింది. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడింది.
బెల్టు షాపుల్లో 80 రూపాయలకే..
స్పిరిట్, క్యారామిల్‌తో తయారు చేసిన నకిలీ మద్యం రాకెట్ గుట్టు తాజాగా బయటపడింది. అన్నమయ్య జిల్లా బెల్టు షాపులో అధికారులకు మద్యం దొరికింది. దీని ద్వారా డొంక కదిలింది. నాలుగేళ్లుగా సాగుతున్న నకిలీ మద్యం దందా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ వంద రూపాయలకు లభిస్తోంది. కానీ.. అన్నమయ్య జిల్లా అనంతరాజుపేటలోని ఓ బెల్టు షాపులో 80 రూపాయలకే దొరుకుతోంది. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసింది. ఇద్దరిని అరెస్టు చేశారు.
ఫోన్ నంబర్ ఆధారంగా..
ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. అసలు విషయం ఇటీవలే బయటపడింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన ఓ ఫోన్ నంబర్ ఆధారంగా.. పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు. చిత్తూరు, కడప జిల్లాల ఎక్సైజ్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి దీనిపై వివరాలు సేకరించారు. నిందితులు ఇచ్చిన ఫోన్ నంబర్‌ను తిరుపతి ఎంఆర్‌పల్లి కూడలిలోని చందు చికెన్ సెంటర్ నిర్వాహకుడు శీను వినియోగిస్తున్నట్లు తెలుసుకున్నారు.
వేరే వ్యక్తిపై సిమ్ కార్డు..
అతనిపై నిఘా పెట్టి.. శీను, అతడి తమ్ముడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే.. గతంలో చికెన్ సెంటర్‌లో పనిచేసిన వెంకటేష్ ఆధార్ కార్డుతో ఆ సిమ్ కార్డు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసుల విచారణలో శీనుకు సన్నిహితుడైన వెంకటరమణ ఈ దందాలో ప్రధాన నిందితుడని తెలుసుకున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
స్పిరిట్, క్యారామిల్‌తో..
అన్నమయ్య జిల్లా పించాకు చెందిన వెంకటరమణ.. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. కరోనా సమయంలో తిరిగి వచ్చాడు. సారా తయారీపై అతనికి అవగాహన ఉంది. దీంతో తన బంధువు జయబాబుతో కలసి తిరుపతి కేంద్రంగా మద్యం తయారీకి ప్లాన్ చేశాడు. స్పిరిట్, క్యారామిల్‌తో తయారు చేసిన మద్యాన్ని పాత సీసాల్లో నింపి స్టిక్కర్లు అతికించేవారు. ఈ సరకును బెల్టు షాపుల్లో విక్రయించేవారు.
అధికారుల సోదాలు..
తరచూ అద్దె ఇల్లు మారుస్తూ.. ఆర్డర్ల మేరకు నకిలీ మద్యం తయారు చేసేవారు. ఈ క్రమంలోనే అధికారులకు ఈ విషయం తెలిసింది. ఎక్సైజ్ అధికారులు ఇటీవల దామినీడు ఎన్టీఆర్ కాలనీలోని 62వ ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. 805 లీటర్ల స్పిరిట్, ఖాళీ సీసాలు, నకిలీ స్టిక్కర్లు, మూతలు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ ఇంట్లో తనిఖీలు చేసి.. రూ.6.05 లక్షల నగదు, 283 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరు తయారు చేసిన మద్యం ఆరోగ్యానికి తీవ్ర హానీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
టాపిక్