Best Web Hosting Provider In India 2024
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి.. 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం?
Telangana Congress : తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అలజడి స్టార్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం 10 మంది ఎమ్మెల్యేలని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే టాక్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అలజడి మొదలైంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యేకు చెందిన ఫాంహౌస్‌లో వీరు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కేబినెట్ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు.. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చర్చ..
ఈ 10 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమచారం. 10 మంది ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.
అత్యవసర సమావేశం..
అయితే.. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందనే చర్చ నడుస్తోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్, దొంతి మాధవరెడ్డి, బీర్ల ఐలయ్య రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు మంత్రులపై అసంతృప్తి..
ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులపై గుర్రుగా ఉన్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై దొంతి మాధవ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మురళీ నాయక్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి వ్యవహార శైలి కారణంగానే రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
సీఎం సీరియస్..!
అయితే.. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవ్వడంతో పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అటు కేసీఆర్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా ఉండదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.
టాపిక్