Best Web Hosting Provider In India 2024
Telangana Police : సిద్దిపేటలో ఆపరేషన్ స్మైల్.. 83 మంది బాల కార్మికులకు విముక్తి
Telangana Police : మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి.. ఎందరో చిన్నారులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి పాలిట ఆపరేషన్ స్మైల్ వరంగా మారింది. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. తెలంగాణ పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
బాల బాలికలకు పని నుంచి విముక్తి కలిగించి.. తిరిగి బడికి పంపించే కార్యక్రమం ఆపరేషన్ స్మైల్ అని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ వివరించారు. ఆపరేషన్ స్మైల్-XI పూర్తయిందని చెప్పారు. జనవరి 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మొత్తం 83 మంది బడీడు పిల్లలకు విముక్తి కలిగించామన్నారు. వీరిలో తెలంగాణ, ఏపీ, యూపీ, ఒరిస్సా, ఛత్తీస్గడ్, బీహార్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నారని చెప్పారు. వారిని వారి తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించామని సీపీ వెల్లడించారు.
17 కేసులు నమోదు..
బాల కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులపై 17 కేసులు నమోదు చేశామని సీపీ అనురాధ వివరించారు. రిస్క్యూ చేసిన పిల్లల్లో చాలామంది కిరాణా షాపుల్లో, మెకానిక్ షెడ్లలో, హోటళ్లలో పనిచేస్తున్నారని చెప్పారు. కొందరు పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటుక బట్టీలలో, కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించి.. వారి తల్లిదండ్రులను, బంధువులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు వెల్లడించారు. చిన్నారులతో పని చేయిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిద్దిపేట డివిజన్లోనే ఎక్కువ..
సిద్దిపేట డివిజన్ పరిధిలో మగ పిల్లలు 29 మంది, ఆడపిల్లలు 16 మంది బాల కార్మికులుగా ఉన్నారని పోలీస్ కమిషనర్ అనురాధ వెల్లడించారు. గజ్వేల్ డివిజన్ పరిధిలో మగ పిల్లలు 19 మంది, ఆడపిల్లలు 10 మంది ఉన్నారని వివరించారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో మగ పిల్లలు 8, ఒక ఆడపిల్లలు ఉందని చెప్పారు. ఆపరేషన్ స్మైల్-XI విజయవంతం చేసిన నోడల్ అధికారి సీసీఎస్ ఏసీపీ యాదగిరి, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఏడాది పొడవునా..
సంవత్సరం పొడవునా ఏ రోజైనా ఎప్పుడైనా, ఎక్కడైనా బాల కార్మికులతో పనిచేయించినట్లు కనబడితే.. వెంటనే డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని సీపీ అనురాధ సూచించారు. సమాచార అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. బడికి వెళ్లే పిల్లలను ఎవరు పనికి పెట్టుకున్నా.. వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
(రిపోర్టింగ్-ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్