Best Web Hosting Provider In India 2024
అభివృద్ధి ఎలా ఉంటుందో తన పాలనలో చేసి చూపించిన వైయస్ జగన్
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగింది. ఎక్కడా అవినీతి, లంచం ప్రస్తావన లేకుండా.. పారదర్శకమైన వ్యవస్థలతో నేరుగా అర్హులకే మేలు కలిగింది. ఆ టైంలో వైయస్ జగన్ పాలనపై దేశవ్యాప్త చర్చ నడవడగా.. ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లోనూ ఆయన మార్క్ కనిపించడం విశేషం.
ఈసారి బడ్జెట్‌లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించుకున్నారు. అయితే ఈ అభివృద్ధి ఎలా ఉంటుందో సీఎంగా వైయస్ జగన్ తన పాలనలో చేసి చూపించారు.
👉వ్యవ‘సాయాని’కే తొలి ప్రాధాన్యమంటూ నిర్మలమ్మ ప్రసంగం పేర్కొంది. ఈక్రమంలో.. ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన కింద పంట ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతులకు పలు రకాల సాయాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే క్రమంలో.. గోదాములను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించింది. ఇక.. వైయస్ జగన్ పాలనలో.. రైతు భరోసాతో పంట సాయం అందించడం, ఆర్బీకే సెంటర్లు.. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్ల అందజేత, ఒకవేళ పంట నష్టం జరిగినా సత్వర పరిహారం లాంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ తరహా సంక్షేమాన్ని అందించలేకపోవడం గమనార్హం.
👉వైద్య విద్యను విస్తరించే క్రమంలో 10,000 అదనపు సీట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. అయితే.. దశాబ్దాల తర్వాత ఏపీలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య విద్యను ప్రొత్సహించారు వైయస్ జగన్. అలాగే.. ప్రజారోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ పరిధిని విసర్తించడం, ఇంటికే వైద్యంలో భాగంగా విలేజ్.. ఫ్యామిలీ క్లినిక్‌ల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
👉దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. కానీ, వైయస్ జగన్ హయాంలో.. నాడు-నేడుతో స్కూళ్లు కళకళలాడాయి. డిజిటల్ క్లాస్ రూంలతో కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారాయన. అలాగే.. ఇంకోవైపు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో విద్యార్థులను చదువును దూరం కాకుండా చూసుకోగలిగారు.
👉మహిళా సాధికారత కోసం కేంద్రం తరఫున రకరకాల పథకాలను ప్రవేశపెడతామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. అయితే పేద వర్గాలకు వైయస్ఆర్ చేయూత, ఆసరా, ఇంకా వివిధ పథకాలతో జగన్ ప్రభుత్వం సాయం అందించింది తెలిసిందే. గ్రామ స్వరాజ్యం, ప్రజారోగ్యం, విద్యా రంగం, మహిళా సాధికారికత.. ఇలా దాదాపు కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక అంశాల్లో జగన్ మార్క్ స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది.