Best Web Hosting Provider In India 2024
TG Mlc Elections : అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, లైసెన్స్ తుపాకులు డిపాజిట్ చేయాలి- సిద్దిపేట సీపీ
TG Mlc Elections : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉందని సిద్ధిపేట సీపీ అనురాధ తెలిపారు. కోడ్ అమల్లో ఉండడంతో లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలని కోరారు.
TG Mlc Elections : మెదక్- కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ఆదేశాలిచ్చారు.
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 8 లోపు డిపాజిట్ చేయాలని సీపీ ఆదేశించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొని వెళ్లవచ్చన్నారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రజలు, ప్రజా ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.
అమల్లోకి ఎలక్షన్ కోడ్
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, అధికారులు, పోలీసులు ఎన్నికల సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాపన్నపేట మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్స్, గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్ ను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఫారాలు డిస్పోస్ గురించి రివ్యూ చేశామన్నారు. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల డేట్ అనౌన్స్ కావడంతో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారం అన్ని ఫారాలు డిస్పోస్ చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు పరిశీలించి, వసతులు బాగున్నాయని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల అధికారుల అనుమతితో సభలు సమావేశాలకు నిర్వహించుకోవాలన్నారు.
సిద్దిపేటలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్ కరీంనగర్-అదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ, ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమిద్ సమావేశం నిర్వహించారు.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో రాజకీయ పార్టీలు ఈసీ సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్ లా కాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్లు భిన్నమైన పద్ధతిలో ఉంటాయన్నారు. అభ్యర్థులు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దు
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, వివిధ ఫంక్షన్ల పేరుతో పార్టీల మీటింగ్ పెట్టడం, ఓటర్లను పోలింగ్ స్టేషన్ వరకు తీసుకురావడం, పట్టభద్రుల, ఉపాధ్యాయుల కోసం పాఠశాలల్లో ప్రచారం చేయకూడదని రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. అలాగే ఓటు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను ఆయా స్థాయిల్లో వెరిఫై చేశాకే ఫైనల్ లిస్ట్ వస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారులకు సహకారం అందించాలని అదనపు కలెక్టర్ కోరారు.
టాపిక్